ఆయనే నా బాస్.. ఆయన చెప్తే చావమన్నా చస్తా - శంకర్ నాయక్

Update: 2023-07-16 05:41 GMT

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చావమంటే చస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మహబూబాబాద్ టికెట్ శంకర్ నాయక్ కు ఇవ్వకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చావమంటే చస్తా

తనకు కేసీఆర్ కు మధ్య మీడియేటర్లు అవసరంలేదని శంకర్ నాయక్ అన్నారు. తనకు ఏదైనా పని ఉంటే నేరుగా సీఎం వద్దకు వెళ్లి జరిగేలా చూసుకుంటానని చెప్పారు. కేసీఆర్ మాత్రమే తనకు బాస్ అని.. ఆయన చావమంటే చస్తానని.. మీరు చస్తారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కన్నతల్లిలాంటిదన్న ఆయన.. దాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలు పడకుండా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజల అదృష్టం

రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూములను వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చి రైతుబంధు, రైతుబీమా, రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు శంకర్ నాయక్ చెప్పారు. కేసీఆర్‌ తెలంగాణ సీఎంగా ఉండటం ప్రజల అదృష్టమని అన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గృహలక్ష్మి, దళిత బంధు, బీసీలకు రూ.లక్ష అందించే ప్రక్రియ నిత్యం కొనసాగుతుందని శంకర్ నాయక్ స్పష్టం చేశారు.

రేవంత్పై ఫైర్

విభజన హామీలు నెరవేర్చలేని పార్టీ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాలేదని శంకర్ నాయక్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని.. దానికి కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా శంకర్ నాయక్ విమర్శలు గుప్పించారు. రైతుకు ఎన్ని గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News