కేటీఆర్ బెస్ట్ ఫ్రెండ్‎కు ఎమ్మెల్యే టికెట్..

Update: 2023-08-22 10:53 GMT

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెద్దగా మార్పులు చేయకుండా సిట్టింగులకే జై కొట్టారు. ఏడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను మార్చేశారు. ఇంకా కొలిక్కిరాని 4 స్థానాలను పెండింగ్‎లో పెట్టారు. టికెట్ల కేటాయింపులో కేటీఆర్ తన మార్క్ చూపెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్‌కు ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఖానాపూర్ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‎ను తొలగించి.. భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు అవకాశం కల్పించారు.

భూక్యా జాన్సన్ కేటీఆర్‎కు క్లాస్ మేట్‎తో పాటు మంచి స్నేహితుడు. నిజాం కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వీరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. గతంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌.. జాన్సన్‌ తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని చెప్పారు. ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటామని.. తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్‌ అన్నివిధాలుగా సహకరించేవాడని చెప్పారు. చదువు తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన జాన్సన్..అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి సెటిల్ అయ్యారు. తర్వాత స్వదేశానికి వచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబర్చని జాన్సన్‎ను..కేటీఆర్, కేసీఆర్ ప్రోత్సాహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఖానాపూర్ నియోజవర్గంలో యాక్టీవ్ అయ్యారని సమాచారం. ముందుగానే టికెట్‎పై హామీ ఉండడంతో పూర్తిగా రాజికీయాలపై దృష్టిసారించి నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. ఆర్థిక, అంగబాలాలు సమృద్ధిగా ఉన్న జాన్సన్‌పై క్యాడర్ కూడా సుముఖంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. దీంతో అతడు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో బరిలోకి దిగనున్నాడు.

Tags:    

Similar News