మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తప్పిన పెను ప్రమాదం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా కలిసి శుక్రవారం (మార్చి 1) చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు మేడిగడ్డపై వాస్తవాలు తెలియపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 200 మందికి పైగా పార్టీ నేతలు తెలంగాణ భవన్ నుంచి వోల్వో బస్సుల్లో మేడిగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ కావడం కలకలం రేపింది. ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ బస్ టైర్ మార్గ మధ్యలో బ్లాస్ట్ అయింది. ఆ సమయంలో బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తుంది. జనగాం దగ్గరలో ఒక్కసారిగా బస్ టైర్ బ్లాస్ట్ అయింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును కంట్రోల్ చేసి పక్కకు ఆపాడు. ఈ ఘటనతో ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తర్వాత టైర్ మార్చుకుని తిరిగి మేడిగడ్డకు ప్రయాణమయ్యారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి.. అక్కడి నుంచే మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుచనున్నారు. మరోవైపు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్న కేటీఆర్‌ను వరంగల్ నేతలు జనగామలీగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో చలో మేడి గడ్డ కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బస్సులను అడ్డుపడి నిరసనలు తెలిపారు.