BRS MLAS : కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలవడం చర్చనీయాంశం అయ్యింది. వారంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్ ను కలిసినట్లు స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై సీఎం, మంత్రులను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయని.. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
తమకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని.. కేసీఆర్ వెంటే ఉంటామని నలుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా అసత్యమన్నారు. తమ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడితే న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పారు. సీఎం కాంగ్రెస్ పార్టీకి కాదని.. అందరికీ అని అన్నారు. సీఎం పీఎంను కలిసినట్లు తాము ఆయన్ని కలిశామని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.