దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే : కవిత

Byline :  Krishna
Update: 2023-09-13 11:24 GMT

దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ స్పీడ్ను కాంగ్రెస్ అందుకోలేకపోతుందని అన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి అని.. ఆ పార్టీని దేశం రిజెక్ట్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో క్రియేటివిటీ, కమిట్‌మెంట్ లేదని.. బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొడుతూ డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌ల మాట‌లు విని ప్రజలు మోసపోవ‌ద్దని సూచించారు.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళనంలో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. ‘‘సీడబ్ల్యూసీ సమావేశాల కోసం గాంధీ పరివారం అంతా తెలంగాణకు వస్తుంది. మొన్న ఖ‌ర్గే వ‌చ్చి ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ ఇచ్చారు. మేం వ‌చ్చి పోడు ప‌ట్టాలు ఇస్తామంటున్నారు. అస‌లు వీళ్లు అప్‌డేట్ కారా..? మొన్న‌నే మ‌నం పోడు ప‌ట్టాలు ఇచ్చేశాం. రాహుల్ గాంధీ అప్‌డేట్ లేని ఔట్‌డేటెడ్ నాయ‌కుడు. కేసీఆర్ స్పీడ్‌ను అందుకోలేరు’’ అని కవిత అన్నారు.

కేసీఆర్ అంటే కైండ్ హార్టెడ్, క‌మిటెడ్ రెస్పాన్సిబుల్ లీడ‌ర్ అని క‌విత చెప్పారు. కేసీఆర్ మ‌మూలు మ‌నిషి కాదు. ఇలాంటి నాయ‌కులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కవిత అన్నారు. గతంలో జీవన్‌రెడ్డి జగిత్యాల అభివృద్ధిని పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఊహకందని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తెలంగాణ అంటే ఒక‌నాడు విషాద‌గాథ‌ అని కానీ ఇప్పుడు విజ‌య‌గాథ అని స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధి చేసే పార్టీకి అండగా ఉండాలని కోరారు.


Tags:    

Similar News