సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పట్నం దంపతులు : BRS MLC Patnam

Update: 2024-02-09 01:23 GMT

బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. వీరిద్దరు సీఎంని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.. సీఎంను వారు కలిసిన సమయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారు. మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నెలలో జరగగా.. అంతకుముందు ఆగస్ట్ నెలలో మహేందర్ రెడ్డి కేబినెట్ మినిస్టర్‌గా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. గత కొంత కాలంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య వైరం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేరతారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో సీఎం, మంత్రులతో బీఆర్ఎస్ నేతల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.పార్లమెంటు ఎన్నికల్లోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని జగ్గారెడ్డి అన్నారు. మరోవైపు, ఇటీవలే పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ నేత వెంకటేశ్ నేత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ గులాబీ గుటిని వీడినారు. బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని, ఆ పార్టీకి కూడా ఎలాంటి రాజకీయ నియమాలు లేవన్నారు.కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అన్న, వదిన ముఖ్యమంత్రిని కలవడం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని క్లారిటీ ఇచ్చారు. వాళ్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తాను టీవీలోనే చూశానని వెల్లడించారు. చేవేళ్ల లోక్ సభ స్థానం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ వారికి ఆఫర్ ఇచ్చినట్లుందని.. అందుకే వాళ్లు రేవంత్ రెడ్డిని కలిశారనుంటానని అన్నారు. కాగా, కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికీ చేరుతారని టాక్.

Tags:    

Similar News