హ్యాట్రిక్ గెలుపే లక్ష్యం.. తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్..

By :  Kiran
Update: 2023-10-25 13:34 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. సరికొత్త వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పార్టీ అభ్యర్థుల ప్రకటన నుంచి రేసులో ముందున్న అధికార బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలోనూ ఫుల్ జోష్తో ముందుకుసాగుతోంది. ప్రతిపక్షాలను ఎండగడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. విపక్షాల వ్యూహాలను చిత్తుచేస్తూ ప్రతివ్యూహాలతో కోలుకోలేని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.

అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా కొంత గ్యాస్ ఇచ్చిన కేసీఆర్ అక్టోబర్ 26 నుంచి మళ్లీ ప్రచార ఉద్ధృతం చేయనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్, బీజేపీలు ఇస్తున్న హామీలకు ధీటుగా సరికొత్త పథకాలను తెరపైకి తెస్తున్నారు. కేవలం ప్రచారాన్ని నమ్ముకోకుండా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే సరికొత్త పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బీమా పథకం ఓట్లు కొల్లగొడుతుందని ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ అధికారం కట్టబెడితే అమలు చేసే కొత్త పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.

అధికారం చేపట్టిన తర్వాత ఉద్యమకారుల్ని దూరం పెట్టిందన్న అపవాదును బీఆర్ఎస్ తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటోంది. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఏపూరి సోమన్న, జిట్టా బాలకృష్ణ, చెరుకు సుధాకర్లను బీఆర్ఎస్లోకి ఆహ్వానించింది. మళ్లీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చింది.

ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రస్తావిస్తూ గతంలో ఆ పార్టీకి 11సార్లు అధికారం కట్టబెట్టినా వాటినెందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ప్రస్తుత కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. పెన్షన్ల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్.. గతంలో ఆ పార్టీ ఎంత మొత్తం ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.4వేలు పింఛను ఇస్తామంటున్న కాంగ్రెస్ ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది.

ఇక డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీకి అడ్డుకట్టవేసేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులేరని సటైర్లు వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత 9 ఏండ్లలో మోడీ సర్కారు తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది.

పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ జాయినింగ్స్పైనా దృష్టి సారించింది. బీఆర్ఎస్కు చెందిన కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఏ స్థాయి నాయకుడు కాంగ్రెస్, బీజేపీలో చేరినా ఆ పార్టీకి చెందిన గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులను తమ పార్టీ వైపు ఆకర్షించేలా ప్లాన్ అమలు చేస్తోంది.

ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలో ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు గ్రామస్థాయి నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు విపక్షాల తీరును ఎండగడుతూ క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది.




Tags:    

Similar News