కోమటిరెడ్డి రాజగోపాల్‌కు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్.. పార్టీలోకి వస్తే!
మునుగోడు ఉప ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు పోరాడి రాష్ట్ర రాజకీయాలను కొన్నిరోజుల పాటు తనవైపు తిప్పుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత కెరీర్‌కు చాలా ప్రాధాన్యమిస్తుంటారు. అన్నేళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన విధిలేని పరిస్థితిలో బీజేపీలో చేరారు. బీజేపీ తనకు ప్రాధాన్యమిస్తుందని కొండంత ఆశ పెట్టుకున్నా చివరికి జాతీయ కార్యవర్గ సభ్యుడి పోస్టుతో సరిపెట్టుకోక తప్పలేదు. రాష్ట్ర కమిటీలో తనకు ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. చిల్లుల చేటలా మారిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మాట్లాడితే ప్రయోజనం ఉండదని నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్, ప్రియాంకా గాంధీలతోనే ముచ్చటించారని టాక్. అయితే పార్టీకి తీవ్ర నష్టం, ద్రోహం చేసి వెళ్లిపోయిన మనిషిని తిరిగి చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హస్తంలోకి రీఎంట్రీ సాధ్యం కాకపోవడంతో ఆయన ప్రస్తుతానికి బీజేపీలోనే ఉండిపోయారని సమాచారం.
రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తే మేకై కూర్చుంటాడని సీనియర్ నేతలు భయపడుతున్నారు. ఆయన పార్టీలోకి వస్తే మునుగోడు టికెట్ అడుగుతారని వారి భయం. ఉప ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఈసారి గెలిచే అవకాశాలున్నాయని, ‘పార్టీలు మారే’ రాజగోపాల్‌కంటే ఆమె బెటర్ అని వాదన. ఇటు బీజేపీలో ఉండలేక, ఇటు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాక అయోమయ స్థితిలో ఉన్న రాజగోపాల్‌పై బీఆర్ఎస్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి.
భువనగిరి ఎంపీ, లేదా మునుగోడు
రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత కరిజ్మా బలమే ఎక్కువ కాబట్టి తమకు కలిసి వస్తుందని గులాబీ దళం భావిస్తోంది. శక్తిమంతులైన కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు తమగూటికి చేరితే అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టూ ఉంటుందని పావులు కదుపుతోంది. రాజగోపాల్ పార్టీలో చేరితో భవనగిరి ఎంపీ లేదా, మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి సిట్టింగ్ ఎంపీ అయిన తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో భువనగిరిలో తమ్ముడికి సమస్య ఉండకపోవచ్చు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ నేతలు చెరుకు సుధాకర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే మునుగోడు, లేకపోతే భువనగిరి ఆప్షన్లను బీఆర్ఎస్ ఆయనకు ఆఫర్ చేస్తోందని, త్వరలోనే దీనిపై సంప్రదింపులు జరుగుతాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.