ప్రజలను మోసగిస్తున్న బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి..ఎమ్మెల్యే సీతక్క
అమలుకు సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో పలువురు చేరారు. బీఆర్‌ఎస్ అధికారంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ను అధికారం నుంచి దింపడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు." తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500కే గ్యాస్ అందిస్తాం. వృద్ధులకు రూ. 4 వేల పించన్ ఇప్పిస్తాం. ఇందిరమ్మ గృహ నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం చేస్తాం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రజలకు అందిస్తాం. 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం. భూమి ఉన్న అన్నదాతలకు ఎకరానికి రూ. 15వేల సాయం అందిస్తాం. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. రైతు కూలీలకు రూ. 12వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం" అని సీతక్క తెలిపారు.