అసెంబ్లీ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా మేనిఫెస్టో గురించి కీలక ప్రకటన చేసింది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉండగా.. బీఆర్ఎస్ అధినేత ఈ నెల 16న మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన కేసీఆర్.. మేనిఫెస్టోలో ఏం ప్రకటిస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
అక్టోబర్ 16న వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ సభలోనే సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. శుభవార్త వినేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతిపక్షాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్ట్ ఉంటుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో వాటికి ధీటుగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కొత్త పథకాలు, హామీలతో పాటు మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.