తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్నా 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు సభలో రాష్ట్ర ఆవిర్భావం- సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి వివరించారు. సాగు నీరు, తాగునీరు, వ్యవసాయం సహా వివిధ అంశాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతు రుణమాఫీని నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. దశల వారీగా నియామక పరీక్షలు నిర్వహిస్తామన్న కేసీఆర్.. గ్రూప్-2తో పాటు ఇతర పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్‌కు ఆదేశించినట్లు చెప్పారు.
ప్రజల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. వేలాది గ్రామాలు పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చిందని కేసీఆర్ సటైర్ వేశారు. దేశంలోనే వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణని స్పష్టం చేశారు.
వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగినా కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి కనిపించకుండా పోయారని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. ధరణి రాకతో 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయన్న ఆయన.. రైతు చనిపోతే వారంలోనే ఆ కుటుంబానికి రూ.5లక్షలు వస్తున్నాయని వివరించారు.