కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వాళ్లే అనుకోలేదని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 420 హామీలతో అందరినీ మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మి జనం కోసం పనిచేసిన గొప్ప నాయకులను సైతం ఓటర్లు తిరస్కరించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినా ఒక్కటి కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని మండిపడ్డారు దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు సర్కారీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై ఏనాడూ తాము ప్రచారం చేసుకోలేదని అన్నారు. ఒకవేళ చెప్పుకుని ఉంటే తాము గెలిచే వాళ్లమని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏ రోజూ ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టలేదని కేటీఆర్ అన్నారు. ప్రజల సౌకర్యం తప్ప రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేని చెప్పారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.