KTR : అప్పులు, శ్వేత పత్రాలంటూ కాంగ్రెస్ తప్పించుకుంటోంది - కేటీఆర్‌

Byline :  Kiran
Update: 2024-01-08 09:10 GMT

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ నేతల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికలకు సంబంధించి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ను పరిశీలిస్తే ఓట్లపరంగా చూస్తే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ మొదటిస్థానంలో ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశముందని కేటీఆర్ జోస్యం చెప్పారు.

గెలుపోటములు బీఆర్ఎస్ కు కొత్త కాదని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చిందని.. ఇప్పుడు మాట దాటేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా తప్పించుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పని తీరు, పాలనా వైఫల్యాలను ఎండగట్టేలా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. 


Tags:    

Similar News