KTR : మీలాంటోళ్లను చాలా మందిని చూసినం.. సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్..

Byline :  Kiran
Update: 2024-01-20 08:26 GMT

లండన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోపల బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ 100రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల అమలుపై దృష్టి పెట్టమని సటైర్ వేశారు. అహంకారంతో మాట్లాడే రేవంత్ రెడ్డి వంటి నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో ఎందరినో చూసిందని అన్నారు. రేవంత్ రెడ్డిలా విర్రవీగే నాయకుల్ని ఎంతో మందిని చూశామని అన్నారు.

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఎందుకు బొంద పెట్టాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చినందుకా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకా, లేక కాంగ్రెస్ నేతలు ఇచ్చిన దొంగ హమీల గురించి ప్రశ్నిస్తున్నందుకా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోవడం ఖాయమన్న కేటీఆర్.. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏక్నాథ్ షిండేగా మారతాడని కేటీఆర్ జోస్యం చెప్పారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని వెంటపడుతున్నాడని విమర్శించారు.

జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలెవరూ కట్టొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒకవేళ అధికారులు కరెంటు బిల్లు కట్టమని సోనియా గాంధీ బిల్లు కడతారని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వినిపించాలని అన్నారు. కరెంటు బిల్లు కాపీలను సోనియా ఇంటికి పంపాలని కేటీఆర్ సూచించారు.




Tags:    

Similar News