కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే రాష్ట్రం అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 60 ఏండ్ల పాటు అధికారం ఇచ్చినా కాంగ్రెస్ ప్రజల కోసం చేసిందేమీలేదని విమర్శించారు. ఆరు దశాబ్దాల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందికి గురి చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు.
గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థి బీజేపీలోకి వెళ్లారని.. ఆయన ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్నదాతలకు రైతు బంధు ఎందుకివ్వలేదని నిలదీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని అంటున్నారని మండిపడ్డారు. కరెంట్ కావాలో? కాంగ్రెస్ కావాలో? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములున్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ కేటీఆర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి బీజేపీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ప్రధాని మోడీని ఆయన ఒక్కసారి కూడా విమర్శించలేదని అన్నారు. ఈసారి ఎన్నికలల్లో 80 సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్‌పై దృష్టి పెడతామన్న కేటీఆర్.. రైతు బంధు చెల్లింపులకు అనుమతివ్వాలని ఈసీని రెండుసార్లు కోరామని స్పష్టం చేశారు.