TS Assembly Budget : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అధికార, విపక్ష సవాళ్ల మధ్య చర్చలు వాడి, వేడిగా సాగనున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది రెండో బడ్జెట్ సమావేశం. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తొలి బడ్జెట్ సమావేశాలపై అందరి దృష్టి ఉంది. తెలంగాణ ఏర్పడిన తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా... పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉండి సమావేశాల్లో పాల్గొంది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంపై ప్రభుత్వం సిద్దమవుతుండగా..వాటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్దమవుతుంది. నేడు గవర్నర్ ప్రసంగం జరగనుంది. అనంతరం ఎల్లుండి (ఫిబ్రవరి 9)న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ జరగనుంది. అదే రోజు బీఏసీ సమావేశాన్ని నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఫిబ్రవరి 10న ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు సుమారు 7-10 రోజుల వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ అసెంబ్లీలో..
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా..ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. మిగిలిన రెండు గ్యారెంటీలైన రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకాలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్, ధరణిపై నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాలు వాదోపవాదనలు చేసుకుంటున్నారు. కృష్ణా నదిపై అవుట్‌లెట్ల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే విషయంపై వాడివేడిగా చర్చకొనసాగుతుంది. ఈ వివాదంపై కొనసాగింపుగా అసెంబ్లీలోనూ ఇదే అంశంపై తీవ్రస్థాయిలో వాద, ప్రతివాదాలు కొనసాగే అవకాశం లేకపోలేదు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్, బీజేపీ నిలదీయడానికి కసరత్తులు చేస్తున్నాయి.
అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం...
ఇవాళ అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో..ఉభయ సభలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.