C voter survey: సీ ఓటర్ సర్వే.. ఓ చీటింగ్ ఓటర్ సర్వే: దాసోజు శ్రవణ్

By :  Bharath
Update: 2023-10-09 15:30 GMT

సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ సర్వే.. ఓ చీటింగ్ ఓటర్ సర్వే అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సమర్థులైన అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 62 సీట్లు గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ఇప్పటికే టీ కాంగ్రెస్ లో అసమ్మతి, గ్రూపు రాజకీయాలు, నాయకుల మధ్య విభేదాలు ఉన్నారు. ఆ పార్టీ నేతలంతా ఇన్నిసార్లు భేటీ అయినా అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నారు. దీన్నిబట్టే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సీ ఓటర్ ఒపినియన్ పోల్ సర్వే.. బోగస్ సర్వేలతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తుందని ఆరోపించారు. సందేహాస్పద సర్వేలు నిర్వహించి.. వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

సీ ఓటర్ల సర్వే.. 2018లోనూ సర్వే చేయడానికి ప్రయత్నించి భంగపడింది. 2023లో మరో నకిలీ సర్వేతో ప్రజల ముందుకు వచ్చింది. కుట్రపూరిత సర్వేలు చేసి కేసీఆర్ ను దెబ్బకొట్టాలనేది వీళ్ల ఉద్దేశం. వీరికి తెలంగాణ ప్రజలు డిసెంబర్ 3న బుద్ధిచెప్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజాలు నాటిన కేసీఆర్.. ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు ఎవ్వరు సరిలేరు.. ఏ పార్టీ పోటీ రాదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు భావితరాల కోసం కేసీఆర్ నే సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఫేక్ సర్వేలు, ఫేక్ ప్రచారాలు ఎన్నివచ్చినా కేసీఆర్ స్థాయిని తగ్గించలేవన్నారు.

Tags:    

Similar News