తెలంగాణ గ్రూప్ -4 పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం పేపర్-1 పూర్తికాగా మ. 2:30 గంటలకు పేపర్ 2 ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని సక్సెస్ కళాశాలలో మాత్రం ఓ అభ్యర్థి మాల్ ప్రాక్టీస్‌కు ప్రయత్నించి పట్టుబడ్డాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అభ్యర్థి వద్ద ఫోన్ ను ఇన్విజిలేటర్ గుర్తించి సీజ్ చేశారు. అతడిపై మాల్ ప్రాక్టీస్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు.