Kandi Srinivas: ఆదిలాబాద్‌లో మహిళా ఓటర్లకు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ!!!
మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు కొందరు నాయకులు ఉచితాలను ఎరగా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇదంతా సాధ్యం కాదని.. ముందే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు, కేఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి .. స్థానిక ప్రజలకు కుక్కర్లను పంపిణీ చేశారు. కుక్కర్లు తీసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలిరాగా, గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రంగంలోకి పోలీసులు.. కుక్కర్ల వెహికల్ ను సీజ్ చేశారు. ఈ క్రమంలో కంది శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే ఓటర్లకు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై కంది శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమకు ఫిర్యాదు అందడంతో భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని కూడా నోటీసులు జారీ చేశారు. ఇక, కంది శ్రీనివాస్‌రెడ్డి ఫౌండేషన్ పేరుతో ఆయన కుక్కర్లను స్థానికులకు పంచిపెట్టి ఆయన పార్టీకి ఓట్లు అడిగాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
కంది శ్రీనివాస్ రెడ్డి కొంతకాలం క్రితమే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలసిందే. అయితే కంది శ్రీనివాస్ చేరికను ఆదిలాబాద్ కాంగ్రెస్‌లోని సీనియర్లు వ్యతిరేకిస్తుున్నారు. మరోవైపు కంది శ్రీనివాస్ ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే కంది శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని పులువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.