Police Checking in Telangana: రూ.300 కోట్లు దాటిన పట్టుబడిన సొత్తు

Update: 2023-10-22 02:28 GMT

రాష్ట్రంలో కట్టలుగా డబ్బు, గుట్టలుగా నగలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్‌ దాటింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే.. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకూ పోలీసులు రూ.307.02 కోట్ల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో డబ్బు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. రోజూ యావరేజ్‌గా 20 కోట్ల రూపాయల విలువైనవి, అక్రమంగా దాచినవి పోలీసులకు తనిఖీల్లో దొరుకుతున్నాయి. గత 24 గంటల్లో 18.01 కోట్ల మనీ లభించగా.. ఇప్పటివరకూ డబ్బు రూపంలో 105.58 కోట్లు దొరికిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

శుక్రవారం ఉదయం నుంచి రూ.కోటి 35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రూ.13.58 కోట్లు. అలాగే 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు మొత్తం రూ.15.23 కోట్ల విలువైన 3,672 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గడచిన 24 గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు మొత్తంగా 202 కిలోల బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారట్ల వజ్రాలు, ఐదు గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.145.67 కోట్ల. అదేవిధంగా వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయి. అక్టోబరు 20 ఉదయం నుంచి 24 గంటల్లో పట్టుబడిన సరుకు మొత్తం విలువ రూ.18.01 కోట్లు.

Tags:    

Similar News