ఇవాళ బీజేపీలో చేరనున్న క్యాసినో కింగ్..ఎల్బీనగర్ నుంచి పోటీ ?

Byline :  Aruna
Update: 2023-09-12 03:28 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు నుంచి బీజేపీ పార్టీ అప్లికేషన్లను స్వీకరించింది. కాషాయ పార్టీకి అభ్యర్థులే లేరనే విమర్శలు చేసిన వారు నోళ్లు మూయించే విధంగా ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే నిత్యం వార్తల్లో నిలిచే క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్‌ కూడా ఇవాళ‌ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‎లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.

కాషాయ జెండా కప్పుకునేందుకు చికోటి ప్రవీణ్ భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ రహదారుల్లో భారీ సైజు బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు నగరంలో భారీ ర్యాలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి చికోటి పోటో చేసే ప్లాన్‎లో ఉన్నారు. ఎంపీ స్థానం కోసం పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. చీకోటి ఎల్బీనగర్ పరిధిలోనే నివాసం ఉండటం వల్ల స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉన్నట్లు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా హిందుత్వ వర్గంతో పాటు తన సామాజిక వర్గం సపోర్ట్ చికోటికి ఫుల్‎గా ఉంది. ఈ క్రమంలో జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే హిందువుల ఓట్లు తనకు కలిసి వస్తాయని అంచనాలు వేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి క్రమంగా ఎదిగారు ప్రవీణ్ కుమార్. అప్పట్లో హిందుత్వ ఎజెండాతో ఆయన పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా ఏ పార్టీలో చేరకపోయినా చికోటి మాత్రం బీజేపీ నిర్వహించే చాలా వరకు కార్యక్రమాల్లో పాల్గొటూ వస్తున్నారు. అంతేకాదు ధర్మ రక్ష పేరిట ఒక హిందూ సంస్థను చికోటి స్థాపించారు. ఇటీవలె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని చికోటి ప్రవీణ్ కలిశారు. అంబర్పేట శంకర్తో కలిసి ఆయన కిషన్ రెడ్డిని మీట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలో వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారు. గతంలో బండి సంజయ్, డీకే అరుణ, రామచంద్రరావు సహా పలువురి నేతలను కలిశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డిని కలవడంతో బీజేపీలో చేరిక కన్ఫార్మ్ అయ్యింది. ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరనున్నారు. తన పొలిటికల్ ఎంట్రీకి బాటలు వేసుకుంటున్నారు.



Tags:    

Similar News