MLA Quota MLC Notification: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్​

Byline :  Veerendra Prasad
Update: 2024-01-11 01:52 GMT

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు డిసెంబర్ 9 వ తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల భర్తీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. రెండింటికి వేర్వేరుగా ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా EC విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నోటీస్‌ బోర్డులో ఈ రెండు నోటిఫికేషన్లనూ అంటించనున్నారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 29న ఉపఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. పోటీ చేసే అభ్యర్థిని.. పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉండడంతో కాంగ్రెస్‌, BRS పార్టీలకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రెండు సీట్లకూ విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సభలో శాసనసభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న అధికార కాంగ్రెస్‌కే రెండు ఎమ్మెల్సీ సీట్లూ దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News