సమస్యాత్మక కేంద్రాలే టార్గెట్.. పాతబస్తీకి పారా మిలిటరీ దళాలు
హైదరాబాద్ లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం, పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. సిటీలో 1669 ప్రాంతాల్లో మొత్తం 4119 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ సెగ్మేంట్లలోనే సుమారు 1800 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బూత్ క్యాప్చర్ చేయటం, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు గత ఎన్నికల ఘటనల ఆధారంగా అధికారురులు గుర్తించారు. ఆ కారణంగానే పాతబస్తీ పరిధిలో పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లుచేయాలని కోరుతూ.. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే.. నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు పరిశీలించారు.
కాగా ఈ పోలింగ్ కేంద్రాల చుట్టూ వంద మీటర్ల రేడియస్‌ను కేంద్ర పారామిలిటరీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. దీనికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రణాళికలను రూపొందిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపటంతో మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర బలగాలు పాతబస్తీకి దిగే అవకాశం ఉంది. మొత్తం 4119 పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీలు ఏర్పాటుచేసి పరిశీలించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే పోలింగ్ సరళి, ఓటర్ల వ్యవహార శైలి, అధికారులు పనితీరు వంటి అంశాలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు.