ఈటలకు "వై" కేటగిరి భద్రత..? ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు..

Update: 2023-06-27 16:36 GMT

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కేంద్రం భద్రత పెంచింది. ఆయన హత్యకు కుట్ర పన్నారన్న వార్తల నేపథ్యంలో వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ఆయన హత్యకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారని చెప్పారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే కౌశిక్ చెలరేగిపోతున్నారని జమున మండిపడ్డారు. ఇలాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ తమిళసైపై కూడా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని జమున గుర్తు చేశారు. శిలాఫలకం మీద ఈటల రాజేందర్ పేరు ఉండొద్దనే కేసీఆర్ చెప్పడంతో అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదని.. ఆ సమయంలో ఉద్యమకారులను కొట్టించాడని మండిపడ్డారు. అమరవీరుల స్థూపాన్ని కూడా తాకే అర్హత అతనికి లేదని అన్నారు.

Tags:    

Similar News