కేంద్రం లెక్కలు: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీచర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయంటే..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం 97,710 పోస్టులకుగాను 86,362 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఈ వివరాల్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి బుధవారం (ఆగస్టు 2) రాజ్యసభకు తెలిపారు. ఈ క్రమంలో పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద తెలంగాణలో 543 స్కూళ్లను ఎంపిక చేసినట్లు తెలపారు.
పీఎంశ్రీ పథకం కింద మొత్తం 14,500 స్కూళ్లను బాగు చేయాలని నిర్ణయించుకోగా.. తొలిదశలో 27 రాష్ట్రాల్లోని 6,207 స్కూళ్లను బాగు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 1205 స్కూళ్లు సెలక్ట్ కాగా.. ఏపీ నుంచి 662 స్కూళ్లను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి 543 స్కూళ్లకు అవకాశం దక్కింది. అయితే ఈ స్కూళ్ల అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని స్కూళ్లకు అవకాశం ఇచ్చింది. కేంద్రం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ చాలెంజ్ పోర్టల్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.