రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

Update: 2023-07-30 06:32 GMT

భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వానలతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. దాదాపు 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా తెలంగాణలో జరిగిన వరద నష్టంపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. వరద నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు సోమవారం కేంద్ర బృందం తెలంగాణ జిల్లాల్లో పర్యటించనుంది.




 


నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని బృందం వరద నష్టాన్ని అంచనా వేయనుంది. ఈ బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

కేంద్ర బృందం భారీ వర్షాల కారణంగా వరద పాలైన ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే వివరాలను జత చేసి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తుంది.




Tags:    

Similar News