ప్రవళిక ఆత్మహత్యకు కారణాలపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆత్మహత్యకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా కారణం కాదని చెప్పారు. ఆమె నిర్ణయం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పారు.
15 రోజుల క్రితమే హాస్టల్లో చేరిందని డీసీపీ చెప్పారు. ఆమె ఇప్పటి వరకు గ్రూప్-2 సహా ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదని స్పష్టం చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్ దొరికిందని దాంతో పాటు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
శివరాం రాథోడ్ అనే వ్యక్తితో ప్రవళిక ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. అతనితో ఆమె చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభించాయని అని అన్నారు. ప్రేమ వ్యవహారం గురించి ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్పారు. శివరాం రాథోడ్ కు మరో యువతితో ఎంగేజ్ మెంట్ అవడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నామని అన్నారు. ప్రవళిక సూసైడ్ నోటును పరీక్షించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, నివేదిక ఆధారంగా శివరామ్ రాథోడ్ పై చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక ఆత్మహత్యపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు.