క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆయనకు కమల పార్టీ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. స్టేట్ ఆఫీస్ లో లీడర్లు ఎవరూ లేకపోవడంతో ఆయన జాయినింగ్ వాయిదా పడింది. సరైన సమాచారం లేకపోవడం వల్లే ఇది జరిగిందని చీకోటి కవర్ చేసుకున్నారు.
బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన చీకోటి ప్రవీణ్ కర్మన్ ఘాట్ నుంచి నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. అయితే పార్టీ ఆఫీసులో లీడర్లు ఎవరూ లేకపోవడంతో ఆయన షాకయ్యారు. దీంతో తన చేరికను వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఇలా జరిగిందని స్పష్టం చేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే తాను బీజేపీలో చేరడాన్ని అడ్డుకుంటున్నారని చీకోటి మండిపడ్డారు. జాతీయ స్థాయి నేతలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. బీజేపీపై అభిమానంతోనే పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. నిజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ కిషన్ రెడ్డి సహా బడా నేతలెవరూ పార్టీ ఆఫీసులో లేకపోవడంతో చీకోటి చేరిక వాయిదా పడింది.