Cheruku Sudhakar : ఇవాళ సొంతగూటికి చేరనున్న చెరుకు సుధాకర్..

By :  Krishna
Update: 2023-10-21 06:55 GMT

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ ఇవాళ బీఆర్ఎస్లో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుధాకర్.. పీడీ యాక్ట్ ను సైతం ఎదుర్కొన్నారు. 2014లో నకిరేకల్ టికెట్ విషయంలో ఆయన బీఆర్ఎస్ను వీడారు. అప్పుడు టికెట్ను వేముల వీరేశంకు పార్టీ కేటాయించింది. ఆ తర్వాత తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. చివరకు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేశారు.

కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదంటూ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ టికెట్ ఆశించిన సుధాకర్కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ఆ టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేశంకు కేటాయించింది. అప్పటినుంచి చెరుకు సుధాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ సైతం ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేలా పావులు కదిపింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆయనతో ఫోన్లో మాట్లాడి.. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన ఇవాళ కారెక్కనున్నారు.

కాంగ్రెస్ లో బీసీ వర్గాలకు తగిన అవకాశాలు లేవని.. టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో చెరుకు సుధాకర్ ఆరోపించారు. అంతేకాకుండా తన రాజీనామాకు ఎంపీ కోమటిరెడ్డి తీరు కూడా కారణమని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తన అడ్డా అన్నట్లుగా కోమటిరెడ్డి ఒంటెద్దు పోకడలు బాధ కలిగించాయన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా నకిరేకల్ టికెట్ను వేముల వీరేశంకు కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇప్పటికైన కాంగ్రెస్ బాధ్యతాయతంగా ప్రవర్తించాలని చెరుకు సుధాకర్ సూచించారు.

Tags:    

Similar News