Caste Census In Telangana: తెలంగాణలో కులగణన.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 03:07 GMT

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని, బీసీ కులాల లెక్కలు తీస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభ ప్రాంగణంలో సీఎంను బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కలిశారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీల సమగ్ర కులగణను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రిజర్వేషన్లు పెంచకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు.

వారి విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గతంలో కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్‌ సదస్సులో తాము ప్రకటించినట్లుగానే.. బీసీ కులగణను నిర్వహిస్తామని చెప్పారు. కులగణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి న్యాయపరమైన అంశాలున్నందున ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికలపై చర్చిస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర బీసీ కుల సంఘాల నేతలు గణేశ్‌ చారి, చిన్న శ్రీశైలం యాదవ్‌, కుల్కచర్ల శ్రీనివాస్‌, విక్రంగౌడ్‌, ఉప్పర శేఖర్‌, మణిమంజరి, శ్రీనివాస్‌, నరేశ్‌, మహేశ్‌, సమత, స్వర్ణ, తారకేశ్వరి, విజయ్‌ పాల్గొన్నారు.

Tags:    

Similar News