Chinnajir Swamy : కేసీఆర్‎కు చినజీయర్ స్వామి పరామర్శ.. ఆ పుకార్లకు చెక్?

Byline :  Veerendra Prasad
author icon
Update: 2023-12-10 02:48 GMT
Chinnajir Swamy : కేసీఆర్‎కు చినజీయర్ స్వామి పరామర్శ.. ఆ పుకార్లకు చెక్?
  • whatsapp icon

హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో తుంటి ఎముక గాయంతో హిప్ రీప్లేస్మెంట్ చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి పరామర్శించారు. చినజీయర్ స్వామి స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతారని, అంతా శుభం జరుగుతుందని ఆశీర్వదించారు.

అయితే తాజా పరామర్శతో కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామి కి మధ్య గ్యాప్ ఉందన్న పుకార్లకు చెక్ పడినట్లయింది. గతంలో సమ్మక్క సారలమ్మలను చులకన భావంతో చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యల కారణంగా.. అప్పటి సీఎం కేసీఆర్ ఆయనతో దూరం పాటించారనే కథనాలు, ఊహాగానాలు గతంలో వచ్చాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం పెట్టింది, యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. అయితే యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఉద్ఘాటన జరిగింది. ఇదే విషయంపై అప్పట్లో చినజీయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా అడిగితే సలహాలు ఇస్తాను. ఆహ్వానిస్తే వెళ్తాను. లేకుంటే చూసి ఆనందిస్తాను అని అన్నారు.

ఈ అంశం తర్వాత చినజీయర్ స్వామి నేతృత్వంలో ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటుండగా.. "చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’ అని అప్పుడే కేసీఆర్ ఈ వ్యాఖ్యలకు చెక్ పెట్టారు.




Tags:    

Similar News