బీఆర్ఎస్ అభ్యర్థికి చెప్పు చూపించిన వ్యక్తి.. పోలీసులపై అసహనం
చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్కు చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఆయన బోయినపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనకు చెప్పు చూపించాడు. దీంతో అతడిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తనకు చెప్పు చూపించడంతో రవిశంకర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కాంగ్రెస్‌తో తనకు ప్రాణహాని ఉందని రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ గూండాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
ఈ ఘటన సమయంలో పోలీసుల తీరు తనను బాధించిందని రవిశంకర్ అన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీశారని వాపోయారు. ఇంతకుముందు నీలోజిపల్లి గ్రామంలో తనపై దాడికి యత్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు కాపాడినట్లు తెలిపారు. తమపై దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న చొప్పదండిని గూండాల చేతుల్లో పెట్టొద్దని ప్రజలను కోరారు.