Double Bedroom Houses : లక్ష బెడ్రూమ్ ఇళ్లు.. నిరుపేదలకు సీఎం శుభవార్త..
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నదని కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలో గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని .. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. ఈ పథకాన్ని ఓ నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.
"హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది" అని కేసీఆర్ తెలిపారు.