ప్రతి ఊరికి రూ.10 లక్షలు.. గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

Update: 2023-06-13 02:02 GMT

గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు, జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ది కోసం మొత్తం 255 గ్రామ పంచాయితీలకు గానూ.. ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు.. ప్రతి మండల(మొత్తం 4 మండలాలు) కేంద్రానికి రూ.15 లక్షలు.. గద్వాల మున్సిపాలిటికి రూ.50 కోట్లు.. మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్​ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట జలాశయం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, తుమ్మిళ్ల ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో క‌ల్వకుర్తి, నెట్టెంపాడు.. కోయిల్‌సాగ‌ర్, బీమా ఎత్తిపోత‌ల‌ పథకాలన్నింటిని పూర్తి చేసుకున్నామని కేసీఆరే పేర్కొన్నారు. తద్వారా 15లక్షల నుంచి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు.తెలంగాణ వచ్చిన తర్వాతే నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుంద‌ని.. గ‌ట్టు ఎత్తిపోతలకు పునాదిరాయి వేసుకున్నామని.. ఆ ప‌నులు కూడా త్వర‌లోనే పూర్తవుతాయ‌ని కేసీఆర్ వివరించారు.

మూడు సంవత్సరాలు కష్టపడి ధరణిని తీసుకువస్తే.. కాంగ్రెస్‌ వాళ్లు బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ధరణి వల్లె రైతుబంధు, ధాన్యానికి డబ్బులు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. ధరణి ఉండాలా వద్దా.. మీరే చెప్పాలని ప్రశ్నించారు. కానీఎక్కడికి వెళ్లిన ధరణి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ప్రతిపక్షాలు మాత్రం ఎత్తేస్తామంటున్నారని విమర్శించారు. ధరణి వద్దనే వాళ్లకు ప్రజలే జవాబు చెప్పాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.    

Tags:    

Similar News