Governor vs KCR : సర్కార్ దాచింది.. మరి ఈ లీకులు ఎవరిచ్చారు.. ?

Byline :  Krishna
Update: 2023-09-25 11:25 GMT

రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గప్ చుప్ రాజకీయం నడుస్తోందన్న టాక్ ఒకటి తెలంగాణలో గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ సిఫార్సు చేసిన ఇద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు దారితీసింది. కొన్ని రోజులుగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్గా నడిచిన వివాదాలకు సెక్రటేరియట్ ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి తమిళిసై రావడంతో పుల్ స్టాఫ్ పడింది. గవర్నర్ సీఎంల మధ్య అంతా బాగుంది అనుకున్న టైంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో తమిళిసై తీసుకున్న నిర్ణయంతో ఈ వివాదాలు మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే ఈ సారి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం దాచిపెట్టిందన్న కొత్త చర్చ మొదలైంది.

ఈ విషయంలో రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య పెద్ద వ్యవహారమే నడిచినట్లు తెలుస్తోంది. ఎస్టీ కోటా నుంచి కుర్రా సత్యనారాయణ, బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్కు అవకాశం ఇవ్వాలని జులై 31న కేబినెట్ నిర్ణయించి.. గవర్నకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును పరిశీలించిన గవర్నర్ కేబినెట్ సిఫార్సును వ్యతిరేకిస్తూ ఈ నెల 19 తేదీనే ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని అందులో వివరించారు.

గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ దాచిపెట్టిందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈనెల 19న రాజ్ భవన్ నుంచి అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం అందితే.. ప్రభుత్వం ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదన్న సంగతి గవర్నర్ ఉత్తర్వులతో తేలిపోయింది. ఆర్టీసీ బిల్లు విషయంలో కార్మికుల ద్వారా గవర్నర్పై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను డిఫెన్స్లో పడేసినట్లు అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. గతంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై కూడా బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది.

సోషల్ మీడియాతో పాటు పార్టీ పరంగా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది. కానీ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఎందుకు మౌనం పాటించిందో అని కొంతమంది చెప్పుకుంటున్నారు.

ఈ నెల 19 నుంచి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ గానీ స్పందించలేదు. తెలంగాణ ఉద్యమకారుడైన దాసోజు శ్రవణ్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల తిరస్కరణ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆశించిన ఎదురుదాడి జరగలేదు. ఎందుకూ అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం బయటపెట్టకపోయే సరికి రాజ్ భవన్ వర్గాలే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ విషయాన్ని లీక్ చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఈ విషయాన్ని దాచిపెట్టడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో గవర్నర్తో కేసీఆర్ కేబినెట్ రాజీకి ప్రయత్నించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలో గవర్నర్ ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో బీఆర్ఎస్ సైలెంట్ అయ్యిందని కొంతమంది అంటున్నారు. అందుకే రాజ్ భవన్ వర్గాలు లీక్ చేశాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.      


Tags:    

Similar News