Amit Shah: కొడుకును ఎలా సీఎం చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన - అమిత్ షా
కేసీఆర్ పాలనపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఫ్యామిలీ కోసం తప్ప ప్రజల కోసం కేసీఆర్ పనిచేయడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ గత పదేండ్లలో కొడుకు కేటీఆర్ ను ఎలా ముఖ్యమంత్రిని చేయాలని ఆలోచించారే తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని అమిత్ షా విమర్శించారు. కొడుకు, బిడ్డ కోసం పనిచేసిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఐఎంఐ చేతిలో కారు స్టీరింగ్
కేసీఆర్ పాలనలో అవినీతి భారీగా పెరిగిపోయిందని అమిత్ షా ఆరోపించారు. నిరుద్యోగం, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా మార్చారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని విమర్శించారు. ఎంఐఎం కనుసన్నల్లో నడిచే సర్కారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల స్థలం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందన్న అమిత్ షా.. దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కిందని అన్నారు.
బీజేపీ సర్కారు ఖాయం
గత పదేండ్లలో కేసీఆర్ సర్కారు ఆదివాసీల కోసం చేసిందేమీ లేదని అమిత్ షా అన్నారు. ఆదివాసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం గాలికొదిలేశాడని మండిపడ్డారు. అన్ని వర్గాలకు అండగా ఉన్న మోడీ సర్కారు.. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంచిందని చెప్పారు. 2014 నుంచి ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా కేసీఆర్ సర్కారు సహకరించలేదని అన్నారు. పసుపు బోర్డు, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు ఘనత మోడీకే దక్కుతుందన్న అమిత్ షా.. డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడటం ఖాయమని అన్నారు.