వలస పోయిన పాలమూరుకు వలసొస్తున్నరు - సీఎం కేసీఆర్

Update: 2023-06-06 15:22 GMT

ఉమ్మడి పాలనలో వలసలతో అల్లాడిపోయిన పాలమూరులో ఇప్పుడు జరిగిన అభివృద్ధిని చూస్తుంటే సంతోషం అనిపిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు. గతంలో బిల్ క్లింటన్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను తీసుకొచ్చి పాలమూరును చూపించిన విషయాన్ని గుర్తు చేశారు.

చెరువులకు పూర్వవైభవం

కాకతీయ రాజులు 75వేల చెరువులు, కుంటలు తవ్విస్తే సమైక్య రాష్ట్రంలో వాటన్నింటినీ నాశనం చేశారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అమలు చేసిన మొట్టమొదటి పథకం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులకు మళ్లీ పూర్వవైభవం వచ్చిందని చెప్పారు. మిషన్‌ కాకతీయ రాక ముందు నాగర్‌ కర్నూల్‌ పాలెం, బిజినేపల్లి వడ్డెమాను చెరువు తుమ్మ, లొట్టపీస్‌ చెట్లతో నిండి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కేసరి సముద్రాన్ని సుందరంగా తీర్చిదిద్ది గౌతమ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ చొరవతో పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తై 20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

లక్షల ఎకరాల్లో పంట

మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు బాగు చేసుకొని, ప్రాజెక్టు నీటితో నింపుకున్నామని బోరుబావులు ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నయని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని, హైదరాబాద్ నుంచి గద్వాలకు వెళ్తుండగా.. పంటలు, కల్లాలు, వడ్ల రాశులు చూసి ఆనందం అనిపించిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లనే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు.

వలసలు బంద్

ఉపాధి లేక వలస వెళ్లిన వారంతా ఇప్పుడు వాసప్‌ వస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు వలసపోయిన పాలమూరు జిల్లాకు ఇప్పుడు బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి నాట్లు వేసేందుకు కూలీలు వలస రావడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరగడంతో పాటు గ్రామాల్లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బొడ్రాయి పండగ చేసుకుంటున్నారంటే గుండెల నిండా సంతోషమనిపించిందని చెప్పారు. కన్నీళ్లు విడిచిన పాలమూరులో.. ఇంత అభివృద్ధి అద్భుతంగా మార్పు రావడం సంతోషంగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.



Tags:    

Similar News