కాంగ్రెస్ గెలిస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లైతది - సీఎం కేసీఆర్

By :  Kiran
Update: 2023-11-14 09:10 GMT

బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల బాగుకోసమని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని కేసీఆర్ సూచించారు. అప్పట్లో పాలకుర్తి నుంచి వేల మంది ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇప్పుడు నాట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక పాలకుర్తిలో 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని కేసీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు దుబారా అని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వారిని ఏం చేద్దామని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు వద్దని, కేవలం 3 గంటలు చాలాని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడని అలాంటి నాయకుల మాటలు విని ఆగం కావద్దని అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్లు అధికారంలో ఉన్నా.. బతుకులు మారలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లవుతుందని అన్నారు. ఎన్నికలవగానే తిమ్మిని బమ్మిని చేసే పనులు మొదలవుతాయని, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లు కష్టాల పాలవుతామని, అందుకే ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఒకవేళ ధరణి పోర్టల్ తీస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అన్నదాతకు ఉచితంగా కరెంటు, సాగు నీళ్లతో పాటు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తున్నామని ఒకవేళ రైతు చనిపోతే వారి కుటుంబానికి రైతు బీమా కింద రూ. 5లక్షలు ఇచ్చి ఆసరాగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం పుట్టించామని కేసీఆర్ చెప్పారు. ఎర్రబెల్లిని మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News