BRS vs CONGRESS ఆకలితో ఉన్న కాంగ్రెస్కు రాష్ట్రాన్ని అప్పజెప్తే మింగేస్తది - సీఎం కేసీఆర్
ఎన్నికలు రాగానే రకరకాల వాళ్లు వస్తుంటారని వారు చెప్పే మాటలు విని ప్రజలు ఆగం కావద్దని కేసీఆర్ అన్నారు. తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పదేండ్లుగా అధికారం కోసం ఆకలితో ఉన్న కాంగ్రెస్ కు రాష్ట్రాన్ని అప్పజెప్తే మింగేస్తుందని విమర్శించారు. స్వరాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు పారిపోయారని కేసీఆర్ మండిపడ్డారు.
కర్నాటకలో కరెంటు కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే ఆ రాష్ట్రం నేతలు వచ్చి మనకు సుద్దులు చెబుతున్నారని మండిపడ్డారు. కర్నాటకలో 20 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం 5గంటలు మాత్రమే ఇస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ధరణి వల్లే భూములు సురక్షితంగా ఉన్నాయని, రైతుల బొటనవేలి ముద్రతో తప్ప మరే విధంగా రికార్డులు మార్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలాంటి ధరణిని తీసేస్తే మళ్లీ అధికారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.
కరెంటు, రైతు బంధు పథకాల విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని కేసీఆర్ గుర్తుచేశారు. వ్యవసాయనికి 3గంటల కరెంటు చాలని ఒకరంటే.. ప్రజలు కట్టిన ట్యాక్సుల పైసలను రైతు బంధు పేరుతో వృథా చేస్తున్నారని మరొకరు అంటున్నారని చెప్పారు. అలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.