CM KCR: ప్రగతిభవన్లో కీలక సమావేశం.. కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ చర్చలు

By :  Krishna
Update: 2023-10-12 15:28 GMT

ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ వారితో సమాలోచనలు జరిపారు. ఎన్నికల ఇంచార్జులుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం.

మరోవైపు పెండిగ్ లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ అయ్యింది. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలకు ఏ క్షణమైన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు మల్కాజ్ గిరి స్థానానికి సైతం అభ్యర్థిని ప్రకటించనున్నారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా పెండింగ్లో ఉంది. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా రెడ్డికి కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే నాంపల్లి, గోషామహల్ స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అటు మల్కాజ్గిరి స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News