అర్చకులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్‌పల్లిలోని 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్.. తెలంగాణ బ్రాహ్యణ సంక్షేమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే మొదటి సారి నిర్మించిన ఈ సదనాన్ని రూ. 12 కోట్లతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ కు పలు హామీలు ఇచ్చారు కేసీఆర్. రాష్ట్రంలోని మరో 2,696 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ఇస్తున్న వేతనాన్ని నెలకు రూ.10వేలకు పెంచారు. అంతేకాకుండా.. వేదపండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచారు. దానికి అర్హత వయసును 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించారు.
తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని 2017, ఫిబ్రవరి 1న ప్రారంభించింది. దాని ద్వారా ఏటా రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఏటా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. విదేశాల్లో చదువుకునే బ్రాహ్యణ విద్యార్థులకు వివేకానంద ఓవర్సిస్ స్కాలర్ షిప్ అందిస్తున్నారు. ఇప్పటివరకు దీని ద్వారా 780 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.