అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Update: 2023-06-22 13:40 GMT

తెలంగాణ సమాజం గర్వించే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా నిర్మించిన అమర జ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నగరం నడిబొడ్డున నిర్మించిన ఈ స్మారకాన్ని ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు.

కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ తొలుత గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అమరవీరులకు నివాళులర్పించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం బిల్డింగ్ లోపలకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన స్మారకానికి అంజలి ఘటించారు ఆ తర్వాత మినీ థియేటర్లో తెలంగాణ ఉద్యమం, ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శనను సీఎం కేసీఆర్ చూశారు. అమర జ్యోతి ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఒకవైపు హుస్సేన్‌సాగర్‌, మరోవైపు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ మధ్యన అమరజ్యోతిని నిర్మించారు. రూ.177.50 కోట్లు ఖర్చుతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. 3.29 ఎకరాల విస్తీర్ణంలో స్మారకం ఏర్పాటుచేయగా అందులో 2.88 లక్షల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు బిల్డింగ్ లో మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, 650 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్, ఇతర సౌకర్యాల కల్పించారు. 350 వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం ఉంది. హుస్సేన్‌సాగర్‌ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లామందిర్‌, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు కనిపించేలా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News