సాయిచంద్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

Update: 2023-06-29 08:35 GMT

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కాసేపటి క్రిత్రం గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. సాయి చంద్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్‌ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్‌ ఆమెను ఓదార్చారు. ఇదే సమయంలో సాయిచంద్‌ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్‌ కంటతడి పెట్టారు. తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని పేర్కొన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తంచేశారు. సాయి చంద్‌ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.

నిన్నరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ వెళ్లిన సాయిచంద్.. అర్థరాత్రి అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాడి కొట్టుకోకపోవడంతో అక్కడి వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించినట్లుగా ధ్రువీకరించామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దినేష్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గచ్చిబౌలీలోని కేర్ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సాయిచంద్‌ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక సాయిచంద్ అంతిమ యాత్ర.. మరికాసేపట్లో గుర్రంగూడలోని ఆయన నివాసం నుంచి బయల్దేరనుంది. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌ స్మశానవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చూస్తున్నారు. మరికాసేపట్లో సాయిచంద్‌ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది.

Tags:    

Similar News