రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
అక్కా తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు మధ్య ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని న్నారు. భారతీయ సంస్కృతికి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదన్న ఆయన.. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి వారు తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు కోరుకుంటారని అన్నారు.
మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోందని సీఎం స్పష్టం చేశారు.. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు.. ఎన్నో వర్గాలకు భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. సంపద సృష్టించి సకలజనులకు పంచుతూ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కొనసాగుతోందని, అనేక పథకాల అమలు ద్వారా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ పెద్దన్నలా రక్షణగా నిలుస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. దీని ఫలితంగానే నేడు తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా రాఖీ పండుగను ప్రేమానురాగాలు, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.