1954లో కట్టిన ఆర్డీఎస్ను ఆంధ్రా పాలకులు నాశనం చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అలంపూర్ వద్ద మొట్టమొదటి పాదయాత్ర చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తన ఒత్తిడికి తలొగ్గి ఆంధ్రా లీడర్లు ఆర్టీఎస్ తూములు మూసేస్తే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాంబులు పెట్టి వాటిని బద్దలు కొడుతామనన్నాడని, ఆ మాట విని తన రక్తం మరిగిందని అన్నారు. ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు.. అక్కడ అడుగు పెడితే.. సుంకేశుల బరాజ్‌ను 100 బాంబులు పెట్టి లేపేస్తానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
100 బాంబులతో ఆర్డీఎస్ ను లేపేస్తానన్న తన మాటలను పాలమూరు ప్రజలు తప్పుగా తీసుకోలేదని, బాంబు వేసే మొనగాడు పుట్టిండని.. నీళ్లు వస్తాయని సంతోషపడ్డారని కేసీఆర్ అన్నారు. అప్పట్లో ఇంటి దొంగలే ప్రాణగండంగా మారి ప్రాజెక్టులను అడ్డుకున్నారని మండిపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రులను చూస్తే వారికి లాగులు తడిసిపోయేవని, పదవులకు భయపడి సమైక్య పాలకులను ప్రశ్నించలేకపోయేవారని విమర్శించారు. పాలమూరు పైన ఉంది ప్రాజెక్టులు ఎలా కడుతావని కొందరు నాయకులు ప్రశ్నిస్తే.. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ నాయకులు ఇప్పుడు కూడా బతికే ఉన్నారని అన్నారు.