ఉప్పొంగుతున్న గోదావరి.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం..
నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గోదావరి వరదపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.
భద్రాచలంలో ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ను తక్షణమే భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితుల ఆధారంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాల నేపథ్యంలో సచివాలయంతో పాటు, కలెక్టరేట్లో ఎమ్మార్వో కార్యాలయాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. సహాయకచర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రెవిన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.