కాంగ్రెస్ సహా రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రావాళ్ల బూట్లు మోసిన వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ల మీదికి రేవంత్ రైఫిల్ పట్టుకుని పోయాడని.. అప్పటినుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అని పెట్టారని విమర్శించారు. తనకు పిండం పెట్టుడు కాదని.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెడతారో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. తిట్టాలంటే తాము కాంగ్రెస్ కంటే ఎక్కువ తిట్టులు తిట్టగలమని.. కానీ అటువంటి సంస్కారం తమది కాదన్నారు. ఓటేసేటప్పుడు ప్రజలు అన్ని ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు.
మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి.. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అనడం సిగ్గుచేటని కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమి లేదని ఆరోపించారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చాక 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పైగా అక్కడి నేతలు తెలంగాణకు వచ్చి 5గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.