అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్సే రావాలి : కేసీఆర్

By :  Krishna
Update: 2023-11-08 11:19 GMT

తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆసిఫాబాద్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మీని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే రాష్ట్ర సాధన కోసమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయి ఉంటే ఆసిఫాబాద్ జిల్లా అయ్యేది కాదన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కావడం వల్లే మెడికల్ కాలేజీ సహా పెద్దాసుపత్రి వచ్చిందన్నారు.

ఆరే, మాలి కులస్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్ తెలిపారు. ఆరె కులస్థులను ఓబీసీ వర్గంలో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల కోసం ఆలోచించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్రానికి ఏం చేశాయో ప్రజలు గమనించాలన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్.. 3గంటల కరెంట్ చాలని రేవంత్ అనడం సిగ్గుచేటన్నారు. దేశంలో 24గంటల ఉచిత విద్యుత్ ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. గత 50 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమిలేదని విమర్శించారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ సారి అధికారంలోకి వస్తే పెన్షన్ను క్రమంగా 5వేలకు పెంచుతామన్నారు. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని.. అభ్యర్థి సహా అతడు పోటీ చేస్తున్న పార్టీ చరిత్రను తెలుసుకుని ఓటెయ్యాలని సూచించారు.


Tags:    

Similar News