చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతుందా : కేసీఆర్

By :  Krishna
Update: 2023-11-08 11:48 GMT

సింగరేణిది 134ఏళ్ల చరిత్ర.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ లాభాల్లో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులకు దసరా బోనస్గా వెయ్యి కోట్ల రూపాయలను అందజేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి నష్టాల్లో కొనసాగిందని ఆరోపించారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ ఆశీర్వాదసభలో కేసీఆర్ ప్రసంగించారు. నియోజకవర్గంలో సుమారు 10వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే దుర్గం చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ను చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడించారని.. అక్కడ చెల్లని రూపాయి బెల్లంపల్లిలో చెల్లుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా, సాగు నీరు, ధాన్యం కొనుగోలు వంటి వాటితో రైతుల అన్ని విధాల అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్... మూడు గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని.. అటువంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సారి గెలిస్తే రైతు బంధును ఎకరానికి 16వేలకు పెంచుతామని చెప్పారు.

కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనూ 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటున్నారని.. ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి వల్లే రైతు బంధు సొమ్మ అకౌంట్లలో జమ అవుతుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News