10ఏళ్లకు ముందు 10ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉంది : కేసీఆర్

By :  Krishna
Update: 2023-11-18 12:09 GMT

తెలంగాణ రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. తాను ఆమరణ దీక్షకు దిగితే దిక్కులేక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణను మోసం చేయడానికని విమర్శించారు. గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. పదేళ్లకు ముందు పదేళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, ధాన్యం కొనుగోలుతో రైతులకు అండగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో 3కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయన్నారు. గత 50ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులున్నా.. తాగునీరు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి తాగునీరు, పంటలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

ఈ పదేళ్లలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని.. ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ధరణి ఉండడం వల్లే రైతు బంధు నిధులు సకాలంలో జమవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తడి చేసిన పెట్టలేదన్నారు. రైతుల కోసం 25వేల కోట్ల నష్టాన్ని భరించామని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News